Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
మహాత్మా గాంధీ - వికిపీడియా

మహాత్మా గాంధీ

వికీపీడియా నుండి

జాతిపిత మహాత్మా గాంధీని గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అన్న మాటలు:

"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మనమధ్య జీవించాడని రాబోయే తరాలవారు నమ్మలేరు"
"మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ గారి ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదానికోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత"

మార్టిన్ లూధర్ కింగ్ : జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాని ఆచరణ చూపించాడు.

సత్యము, అహింసలు గాంధీగారు కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యంతముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను CNN జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురుగువాడలు శుభ్రము చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యులు.




విషయ సూచిక

[మార్చు] బాల్యము, విద్య

"మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 న గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరమ్ చంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము.

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు(హరిలాల్ గాంధీ. మణిలాల్ గాంధీ.రామదాస్ గాంధీ. దేవదాస్ గాంధీ)


చదువులో గాంధీ మధ్యస్తమైన విద్యార్ధి. పోర్ బందర్ లోను, రాజకోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాటప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివారు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి.


1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చారు. బొంబాయిలోను, రాజకోటలోను ఆయన న్యాయవాద వృత్తిప్రయత్నము అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటాల్ లో ఒక లా కంపెనీలో సంవత్సరము కంట్రాక్టు లభించింది.

[మార్చు] దక్షిణ ఆఫ్రికా ప్రవాసము

బారిస్టరుగా  గాంధీ - వ్యంగ్యచిత్రం
బారిస్టరుగా గాంధీ - వ్యంగ్యచిత్రం

ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీగారు దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరములు (1891 నుండి 1914) గడిపారు. కేవలం తెల్లవాడు కానందువల్ల మొదటి తరగతి రైలు బండిలోంచి వెళ్ళగొట్టబడటం,హోటళ్ళలో ప్రవేశము నిరాకరించబడటం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నారు. గాంధీగారి నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రుపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి.


భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894లోభారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రముగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించారు. "ఇండియన్ ఒపీనియన్" అనే పత్రికను ఆయన ప్రచురించారు. "సత్యాగ్రహము" అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాత్వుత్వము అనే సుగుణాలతో జీవితం సాగించడంలో ఇద ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు, కష్ట నష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది.


కానీ గాంధీగారికి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను ఆయన సమర్ధించారు. బోయర్ యుద్ధకాలం (1899-1902)ఆయన తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నులైనారు. ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది.


ఈ కాలంలో అనేక గ్రంధాలు చదవడం వల్లా, సమాజాన్ని అధ్యయనం చేయడం వల్లా ఆయన తత్వము పరిణతి చెందింది. లియో టాల్స్టాయ్ గారి "The Kingdom of God is WIthin You", బెర్ట్రాండ్ రస్సెల్ గారి "Unto the Last" అనే గ్రంధాలు ఆయనను బాగా ప్రభావితం ఛేశాయి. కాని, అన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంధము "భగవద్గీత" - గీతా పఠనం వల్ల ఆయనకూ ఆత్మ జ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయఅన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించారు.


దక్షిణాఫ్రికాలో "ఫినిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాత్వత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీగారు స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవనవిధానంలో పాలు పంచుకొన్నారు. ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించారు.


క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము.


1914 లో గాంధీగారు భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

[మార్చు] భారతదేశములో పోరాటము ఆరంభ దశ

భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీగారు పాల్గొన సాగారు. అప్పటి ప్రధాననేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీని భారతరాజకీయాలకూ, సమస్యలకూ పరిచయం చేశారు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీగారు మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్ధించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదము.


బీహార్ లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ రైతులను ఆహార పంటలు వదలి, నీలి మందు వంటి వాణిజ్యపంటలు పండించమని నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడాలోనూ ఇదే పరిస్థితి. గాంధిగారు ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను వీడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేలు గాంధీగారికి కుడిభుజంగా నిలచారు. ఆయన నాయకత్వంలో వేలాదిగా పరజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు.


సమాజంలో అశఅంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు వత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీగారిని ప్రజలు ప్రేమతో "బాపు" అనీ, "మహాత్ముడు" అనీ పిలుచుకొనసాగారు. గాంధిగారి నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి.


1919 లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీగారు నడపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపారు. పట్టుబట్టి ఆ దాడులో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాపతీర్మానాన్ని ఆమోదింపజేశారు. హింసకు హింస - అనేది గాంధీగారి దృష్టిలో దుర్మార్గము. ఏవిధమైన హింసయినా తప్పే.


ఏప్రిల్ 13, 1919 న అమృత్ సర్, పంజాబులోని జలియన్ వాలాబాగ్ లో సామాన్యజనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాటవిధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీగారికి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతే కాదు. భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీగారిలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది.


1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డారు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము "స్వరాజ్యము" అని ప్రకటించారు. వారి బావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ, ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీగారు తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించారు

  • "స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం - వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.


  • "సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకారము నిరాకరించడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందును దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఏ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922 లో ఉత్తరప్రదేష్ చౌరీచోరా లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమద అదుపు తప్పుతున్నదని గ్రహించి దాన్ని వెంటనే ఆపుజేశారు.
  • "సమాజ దురాచార నిర్మూలన" - గాంధీగారి దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాదుకొంటున్నచోట స్వాతంత్ర్యమున్నదనుకోవడంలో అర్ధం లేదు. గాంధీగారు ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.


1922 లో రెండు సంవత్సరాలు జైలులో గడిపారు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిమ్ వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. 1924లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించారు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అస్పృశ్యతా, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు.


1927లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీగారు స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్ర తీసికొన్నారు. అందరికీ సర్ది చెప్పి, 1928లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశారు.అందుకు బ్రిటిష్ వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చారు. ఆయినా ఫలితం శూన్యం.


1929 డిసెంబరు 31 న లాహోరులో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్ర్యదినంగా ప్రకటించారు. అప్పటినుండి ఉద్యమం చివరిపోరాటం మొదలైందని చెప్పవచ్చును.

[మార్చు] పతాకస్థాయి పోరాటము

ఉప్పు సత్యాగ్రహము (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమము స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు.

దండి సత్యాగ్రహంలో  గాంధీ
దండి సత్యాగ్రహంలో గాంధీ
దండి సత్యాగ్రహం మార్గం
దండి సత్యాగ్రహం మార్గం


ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చ్ లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. చేసిన పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932 లో లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు భారతజాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీగారు హాజరయ్యారు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించారు. 1932 లో నిమ్నకులాలవారినీ, ముస్లిములనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపె ట్టారు.ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీగారు సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా వత్తిడి చేశారు.


తరువాత అంటరానివారిగా చూడబడిన వర్గాలపట్ల సమాజదృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచాడినికి గాంధీగారు తీవ్రంగా కృషి చేశారు. వారిని హరిజనులని పిలిచారు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించారు. 1934 లో ఆయనపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి.


ఫెడరేషన్ పద్ధతిలో కాంగ్రెస్సు ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమైనపుడు గాంధీగారు కాంగ్రెసుకు రాజీనామా చేశారు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయనాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్ర్యమనే ప్ధాన లక్ష్యాన్నుంచి దృష్టి మరలకూడదనీ ఆయన ఉద్దేశము.


1936లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీగారు ప్రధానపాత్ర తీసుకొన్నారు. 1938లో కాంగ్రెసు ప్రెసిడెంటుగా ఎన్నికైన సుభాస్ చంద్రబోసుతో గాంధీగారికి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీగారి ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. తరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యారు.


1939లో రెండవ ప్రపంచయుద్ధము మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భఅరతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటునుండి కాంగ్రెసు వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది.


"క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీగారు చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృధంగా స్పష్టం చేశారు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.


1942 ఆగస్టు 9 న గాంధీ తో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూనా జైలులో గడిపారు. ఈ సమయంలోనే ఆయన సెక్రటరీ మాధవదేశాయ్ మరణించారు. ఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించారు. గాంధీగారి ఆరోగ్యము బాగా క్షీణించింది. అనారోగ్యకారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారు.యుద్ధము తరువాత ఇతర నాయకులనూ, లక్షపైగా ఉద్యమకారులనూ విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్ర్యం ఇవ్వబడుతుందని అంగీకరించారు. ఈ విధంగా "భారత్ ఛోడో" ఉద్యమం ఒకమోస్తరుగా విజయవంతమైనది.

[మార్చు] స్వాతంత్ర్య సాధన, దేశ విభజన

నెహ్రూ, రాజకుమారి అమృతకౌర్ లతో గాంధీ - సంతకం చేసిన ఫొటో
నెహ్రూ, రాజకుమారి అమృతకౌర్ లతో గాంధీ - సంతకం చేసిన ఫొటో

1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టారు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయము. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, పటేల్ అభిప్రాయపడ్డారు.


1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి ఆలోచన ససామాజికంగానూ, నైతికంగానూ,ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ.


కాని ముస్లిమ్ లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా గారికి పశ్చిమ పంజాబు, సింద్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లో మంచి ప్రజాదరణ ఉన్నది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని ఆయన ప్రగాఢ వాంఛ. కాని జిన్నాగారు - "దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి" - అని హెచ్చరించారు. చివరకు హిందూ-ముస్లిమ్ కలహాలు ఆపాలంటే దేశవిభజనకంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించారు. చివరకు హతాశులైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని ఆయన పూర్తిగా కృంగిపోయారు.


1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణులైన గాంధీగారు మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపారు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.

[మార్చు] చివరి రోజులు

జాతిపిత మహాత్మా గాంధీ
జాతిపిత మహాత్మా గాంధీ

స్వాతంత్ర్యానంతరం గాంధీగారి ప్రయత్నాలు హిందూ-ముస్లిమ్ విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీగారిపై బదింది. దేశవిభజనతో, ముఖ్యంగా పంజాబు, బెంగాలులలో, పెద్దయెత్తుగా సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాష్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీగారికి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల భయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్దానికి దారితీస్తుందనీ గాంధీగారి అభిప్రాయం.


ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశారు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించారు.


కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీగారి పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నారని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.


రాజ్ ఘాట్
రాజ్ ఘాట్

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీగారు "హే రామ్" అన్నారని చెబుతారు. ఢిల్లీ రాజఘాట్ లో ఆయన సమాధిపై ఈ మంత్రమే చెక్కి ఉన్నది.

మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ గారు రేడియోలో అన్న మాటలు:

"మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించరు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయారు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము"

[మార్చు] గాంధీ తత్వము

(దీనికి ప్రత్యేక వ్యాసము చూడండి)


[మార్చు] వనరులు

[మార్చు] ఇప్పటి పరిస్థితి

[మార్చు] అవీ, ఇవీ

te:మహాత్మా గాంధీవర్గం:జాతీయోద్యమ నాయకులు

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com