రఘుపతి వేంకటరత్నం నాయుడు
వికీపీడియా నుండి
విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రదేశాన పేరుపొందిన వ్యక్తి, ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్)నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు నదిలీ కావడంతో, అక్కడి నిజం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువ్వత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు.
ఎం.ఏ కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు. 1904లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల -పి.ఆరంకళాశాల- ప్రిన్సిపాలంగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1927లో పరిషత్తు మొదటి స్నతకోత్సవంలో నాయుడుకు గౌరవ డాక్టరేటంతో సత్కరించింది.
1884లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది.1889లో ఆమె మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను శ్వేతాంబర ఋషి అనేవారు. పేద విద్యార్థులకు, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.
1939 మే 26న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన రఘుపతి వెంకయ్య, నాయుడు సోదరుడే.
[మార్చు] సంఘ సంస్కరణ
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన కులవ్యవస్థ నిర్మూలనకు కృషిచేసాడు. మద్యనిషేధం కొరకు శ్రమించాడు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భొగం మేళాల సాంప్రదాయాన్ని అంతరింపజేసాడు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.
[మార్చు] బిరుదులు
అఘుపతి వెంకటరత్నం నాయుడుకు ఎన్నో బిరుదులు ఉండేవి. వివిధ రంగాల్లో ఆయన కృషికి గుర్తింపుగా ఒన్ని పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. వాటిలో కొన్ని:
- బ్రహ్మర్షి
- శ్వేతాంబర ఋషి
- అపర సోక్రటీసు
- కులపతి
- దివాన్ బహదూర్
- కైజర్-ఇ-హింద్
- సర్
[మార్చు] మూలాలు, వనరులు
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు
- అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు