శ్రీశ్రీ
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] శ్రీరంగం శ్రీనివాస రావు
శ్రీశ్రీ అంటే విప్లవ రచయిత
శ్రీశ్రీ అంటే అభ్యుదయ కవి
శ్రీశ్రీ అంటే సినిమా రచయిత
శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం
శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాస రావు (Sri Sri - Srirangam Srinivasa Rao)
[మార్చు] జీవిత గమనం
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మ తో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జువాలజీ)పూర్తి చేసాడు.
1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకం గా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.
1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రి లో ఉండవలసి వచ్చింది.
1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని.
అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచి రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
[మార్చు] సాహితీ వ్యాసంగం
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.
1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది.
తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు.
ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు.
మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయం గా రాసాడు. అందులో ఇలా రాసాడు:
"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగ తెలుస్తోంది."
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.
ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
[మార్చు] ప్రముఖ రచనలు
- మహాప్రస్థానం
- మరోప్రపంచం
- చరమ రాత్రి
- ఖడ్గసృష్టి
- ప్రజ (ప్రశ్నలు జవాబులు)
- సిప్రాలి
- అనంతం (ఆత్మకథ)
[మార్చు] ప్రముఖ సినిమా పాటలు
కారులో షికారుకెళ్ళె (తోడికోడళ్ళు)ఈ పాట రాసింది ఆత్రేయ!- హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
- నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
- తెలుగువీరలేవరా (అల్లూరి సీతారామరాజు)
- మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
[మార్చు] వివాదాలు
[మార్చు] శ్రీశ్రీ పలుకులు
చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. ఆయన చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
- రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు ఆయనను అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ ఇలా అన్నాడు - "ఊరికే".
- ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
- "వ్యక్తికి బహువచనం శక్తి"
- స్నేహితులతో కలిసి మద్రాసు లో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
[మార్చు] ప్రముఖుల పలుకులు
- "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగు లో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
- "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో
[మార్చు] యోగ్యతా పత్రం
యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికల లో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల ష్డ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది.
-
- ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
-
- తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చి రెడ్డి అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు:
"యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కర లేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
[మార్చు] బయటి లింకులు
టాంకు బండ పై విగ్రహాలు | బొమ్మ:TankBund.jpg |
---|---|
సికింద్రాబాదు నుండి వరసగా
సమర్పణ ఫలకం | రుద్రమ దేవి | మహబూబ్ ఆలీఖాన్ | సర్వేపల్లి రాధాకృష్ణన్ | సి.ఆర్.రెడ్డి | గురజాడ అప్పారావు | బళ్ళారి రాఘవ | అల్లూరి సీతారామరాజు | ఆర్థర్ కాటన్ | త్రిపురనేని రామస్వామిచౌదరి | పింగళి వెంకయ్య | మగ్దూం మొహియుద్దీన్ | సురవరం ప్రతాపరెడ్డి |జాషువ | ముట్నూరి కృష్ణారావు | శ్రీశ్రీ | రఘుపతి వెంకటరత్నం నాయుడు |త్యాగయ్య| రామదాసు | శ్రీకృష్ణదేవరాయలు | క్షేత్రయ్య | పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి | బ్రహ్మనాయుడు | మొల్ల | తానీషా | సిద్ధేంద్ర యోగి | వేమన | పోతనామాత్యుడు | అన్నమాచార్య | ఎర్రాప్రగడ | తిక్కన సోమయాజి | నన్నయభట్టు | శాలివాహనుడు |