పోతన
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరి భాగవతము తో తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్లు జిల్లాలోని బమ్మెర గ్రామములో జన్మించినారు. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ భాగవతము మొత్తము తెలుగు తనము ఉట్టిపడుతుంది. వీరభద్ర విజయము, భోగినీ దండకము వీరి ఇతర రచనలు.
పోతన, శ్రీనాధ కవిసార్వభౌముడు సమకాలికులు. బంధువులు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతనగారు వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ,హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసుకోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతనగారు అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.
ఫొతనగారి కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపిఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.
వీరి భాగవతము నుండి మచ్చుకి కొన్ని పద్యాలు :-
ఆయన సంకల్పాన్ని, వినయాన్ని, భక్తిని చాటే పద్యములు....
-
- పలికెడిది భాగవతమట
- పలికెంచెడువాడు రామ భద్రుండట, నే
- పలికిన భవహరమగునట
- పలికెద వేరొండు గాధ పలుకగనేలా
-
- చిత్రంబులు, త్రైలోక్య ప
- విత్రంబులు, భవలతా లవిత్రంబులు, స
- న్మిత్రంబులు, ముని జనవన
- చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబుల్
బృందావనములో గోపాలుని వెదుకుచున్న గోపకాంతల తాపత్రయము.....
-
- నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై
- జల్లెడువాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వురా
- జిల్లెడుమోమువా డొకడు ెల్వల మానధనంబు దెచ్చె నో
- మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ, చెప్పరే?
-
- మామా వలువలు ముట్టకు
- మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్
- మా మాన మేలకొనియెదు
- మా మానసహరణ మేల మానుము కృష్ణా:
-
- పున్నాగ: కానవే పున్నాగ వందితు, తిలకంబ: కానవే తిలకనిటలు
- ఘనశర: కానవే ఘనసారశోభితు, బంధూక: కానవే బంధుమిత్రు
- మన్మథ: కానవే మన్మథాకారుని, వంశంబ: కానవే వంశధరుని
- చందన: కానవే చందన శీతలు, కుందంబ: కానవే కుందరను
మొసలిబారి చిక్కిన గజేంద్రుడు ఆపన్నశరణుని వేడుకొన్న విధము... దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు ఈ పద్యము చక్కని సమాధానము. అన్ని మతములవారికి సరిపోగలదు.
-
- ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
- యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
- బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
- డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
-
- లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
- ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
- నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
- రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;
గజరాజును కాచుటకు తొందరపడుచున్న శ్రీ మహా విష్ణువు ఆర్తజనరక్షణా తత్వము ఇలా ఉన్నది.
-
- సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
- పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
- తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
- పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.
-
- తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
- న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ
- క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చిరొ
- య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
గోపాలుని ఆగడాలగురించి గోపకాంతలు యశోదమ్మకు పిర్యాదు చేస్తున్నారు......
-
- పడతీ: నీ బిడ్డడు మా
- కడవలలో నున్న మంచి కాగిన పా లా
- పడుచులకు బోసి చిక్కిన
- కడవలబో నడిచె నాఙ్న గలదో లేదో?
-
- ఓ యమ్మ నీ కూమరుడు
- మాఇంటి పాలు పెరుగు మననీ డమ్మా
- పోయదము ఏక్కడి కైనను
- మాయనెన్నల సొరబులాన మంజుల వాణి
మన్ను తిన్నావా? కన్నా? అని తల్లి యశోద గద్దించినది. లేదమ్మా అని బాలకృష్ణుడు నోరు తెరచి చూపెను. ఆ లీలామానుషుని నోట యశోదమ్మ సకల భువనములను చూచి అబ్బురపడినది...........
-
- కలయో!వైష్ణవమాయయో! ఇతర సంకల్పార్ధమోసత్యమో
- తలపన్ నేరక యున్నదాననొ: యశోదాదేవి గానో! పర
- స్థలమో! బాలకుడెంతయీతనిముఖస్తంబైయజాండంబు ప్ర
- జ్వలమైన్ యుండుట కేమిహేతువో! మహాశ్చర్యంబు చింతింపగన్
నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము......
-
- ఇందు గలడందు లేడను
- సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
- డెందెందు వెదెకి చూసిన
- అందందే కలడు దానవాగ్రణి కంటే!
[మార్చు] బయటి లింకులు
భాగవతము స్కందములు | బొమ్మ:BhagavataM cover.jpg |
---|---|
ప్రధమ స్కంధము | ద్వితీయ స్కంధము | తృతీయ స్కంధము | చతుర్ధ స్కంధము | పంచమ స్కంధము | షష్ఠ స్కంధము | సప్తమ స్కంధము | అష్టమ స్కంధము | నవమ స్కంధము | దశమ స్కంధము | ఏకాదశ స్కంధము | ద్వాదశ స్కంధము |