ర్యాలీ
వికీపీడియా నుండి
ర్యాలీ తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెంకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ గ్రామం ఉంది. ఇక్కడ జగన్మోహినీ - చెన్న కేశవస్వామి ఆలయం వుంది. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టింఛాడని చెబుతారు. ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం వుంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అమె సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడ సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం వూరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది. విష్ణుదేవుని పాదాల దగ్గరేకదా గంగ పుట్టింది. ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు, శ్రీదేవి, భూదేవి, గంగ, గరుత్మంతుడు, చెక్కబడారు. దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని పంచివచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తియేనని మరచి, ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంటపడి పరుగెత్తాడట. ఆమె యిక్కడి వరకూ వచ్చి జగన్మోహినీ- చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని యిక్కడ జనం వాడుకగా చెబుతుంటారు.
ఈ ఆలయాన్ని ' బదలీ ఆలయంగా ' ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదలీ అవుతారనే నమ్మకం ఆంధ్ర ప్రదేశ్ అంతటా వ్యాపించింది. మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజార్లు చమత్కరిస్తుంటారు.