యల్లాప్రగడ సుబ్బారావు
వికీపీడియా నుండి
యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12,1895- ఆగష్టు 9,1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. సుబ్బారావు పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబములో జన్మించారు.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.
సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్ తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.